గీతార్థ సంగ్రహం – 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

గీతార్థ సంగ్రహం

<< గీతార్థ సంగ్రహం – 2

 

మొదటి షట్కము (1 – 6 అధ్యాయముల) యొక్క సారాంశం

5 వ శ్లోకం

అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మధియాకులం |

పార్థమ్ ప్రపన్నముద్దిశ్య శాస్త్రావతరణం కృతం ||

githacharya-2

Listen

 

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మధియా  : సహజముగా అయోగ్యమైన బంధు ప్రీతి / అనుబంధం మరియు కారుణ్యము వలన (ఇది ఆత్మ తత్వానికి కూడనిది) ఆందోళనకు గురైన బుద్ధిచేత తన ధర్మమైన యుద్ధమును అధర్మముగా పరిగణించుటచే

ఆకులం  :  వ్యాకులము చెందిన / కలతనొందిన

ప్రపన్నం  :  శరణాగతిచేసిన

పార్థమ్ ఉద్దిశ్య  :  అర్జునుని ఉద్దేషించి

శాస్త్రావతరణం కృతం : గీతా శాస్త్రము ప్రారంభించబడినది (మొదటి అధ్యాయంలో మరియు రెండవ అధ్యాయం యొక్క మొదటి భాగంలో)

 

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

గీతా శాస్త్రము (శ్రీ కృష్ణుని) శరణాగతిచేసిన అర్జునుని ఉద్దేషించి ప్రారంభించబడినది. సహజముగా అయోగ్యమైన బంధు ప్రీతి / అనుబంధం మరియు కారుణ్యము వలన (ఇది ఆత్మ తత్వానికి కూడనిది) ఆందోళనకు గురైన బుద్ధిచేత తన ధర్మమైన యుద్ధమును అధర్మముగా పరిగణించుటచేత కలతనొందిన అర్జునుని ఉద్దేషించి గీతా శాస్త్రము (మొదటి అధ్యాయంలో మరియు రెండవ అధ్యాయం యొక్క మొదటి భాగంలో) ప్రారంభించబడినది.

 

6 వ శ్లోకం:

నిత్యాత్మా సంగకర్మేహా గోచరా సాంఖ్య యోగధీః |

ద్వితీయే స్థితధీలక్ష్యా ప్రోక్తా తన్మోహ శాంతయే ||

arjun-krishna-2

Listen

 

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

నిత్యాత్మా సంగకర్మేహా గోచరా  :  నిత్యమైన ఆత్మా, నిష్కామ / ఫలాపేక్షలేని కర్మాచరన మున్నగు అంశములు

స్థితధీలక్ష్యా  :   స్థిత ప్రఙ్ఞత (నిశ్చయాత్మకముగా వుండుట మరియు ఙ్ఞాననిష్ఠ కలిగియుండుట) లక్ష్యముగా కలిగియుండుట

సాంఖ్య యోగధీః  :  స్వస్వరూప మరియు కర్మయోగ ఙ్ఞానము

తన్మోహ శాంతయే  : అర్జునుని మోహమును లేదా భ్రాంతిని తొలగించుటకు

ద్వితీయే  :  రెండవ అధ్యాయంలో రెండవ భాగంలో

ప్రోక్తా  :  చెప్పబడినది

 

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

నిత్యమైన ఆత్మా, నిష్కామ / ఫలాపేక్షలేని కర్మాచరన, స్థిత ప్రఙ్ఞత (నిశ్చయాత్మకముగా వుండుట మరియు ఙ్ఞాననిష్ఠ కలిగియుండుట) లక్ష్యముగా కలిగియుండుట, స్వస్వరూప మరియు కర్మయోగ ఙ్ఞానము మున్నగు అంశములు, అర్జునుని మోహమును లేదా భ్రాంతిని తొలగించుటకు రెండవ అధ్యాయంలో రెండవ భాగంలో చెప్పబడినది.

 

7 వ శ్లోకం:

అసక్త్యా లోకరక్షాయై గుణేష్వారోప్య కర్తృతామ్ |

సర్వేశ్వరే వాన్యస్యోక్తా తృతీయే కర్మకార్యతా ||

Sandhyavandanam

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

లోకరక్షాయై :  ప్రజలను (ఙ్ఞాన యోగము నందు అర్హత లేనివారిని) రక్షించుటకై,

గుణేశు  :  సత్వ (నిశ్చలమైన), రజో (తీవ్రమైన భావావేశము), తామస (అజ్ఞానం) గుణము ల యందు

కర్తృతామ్ ఆరోప్య  : కర్తృత్వమును ఆరోపించి

సర్వేశ్వరే వాన్యస్య  :  కర్తృత్వమును సర్వేశ్వరుడైన నారాయణుని యందు ఉంచి

అసక్త్యా  :  మోక్ష సాధన కాకుండా ఇతర ఏ లక్ష్యములో నిర్లిప్తత లేకుండా

కర్మకార్యతాఅందరూ తమ కర్మలను ఆచరించవలెను అని

తృతీయే ఉక్తా : తృతీయ అధ్యాయమునందు చెప్పబడినది

 

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ప్రజలను (ఙ్ఞాన యోగము నందు అర్హత లేనివారిని) రక్షించుటకై, సత్వ (నిశ్చలమైన), రజో (తీవ్రమైన భావావేశము), తామస (అజ్ఞానం) గుణములయందు కర్తృత్వమును ఆరోపించి కాని, కర్తృత్వమును సర్వేశ్వరుడైన నారాయణుని యందు ఉంచి కాని, మోక్ష సాధన తప్ప ఏ ఇతర లక్ష్యములలో నిర్లిప్తత లేకుండా అందరూ తమ కర్మలను ఆచరించవలెను అని తృతీయ అధ్యాయమునందు చెప్పబడినది.

 

8 వ శ్లోకం:

ప్రసంగాత్ స్వస్వభావోక్తిః కర్మణోకర్మతాస్య చ |

భేదాః, ఙ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాధ్యాయ ఉచ్యతే ||

krishna-leela

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

చతుర్థాధ్యాయే  :  నాల్గవ అధ్యాయంలో

కర్మణః అకర్మతా ఉచ్యతే  : కర్మ యోగం (ఙ్ఞాన యోగంతో కలిసి) ఙ్ఞానయోగాకారత్వముగా చెప్పబడినది

అస్య భేదాః చ (ఉచ్యన్తే) :  కర్మ యోగము యొక్క స్వరూపమును మరియు వాని భేదములు చెప్పబడెను

ఙ్ఞానస్య మాహాత్మ్యం (ఉచ్యతే)  : ఙ్ఞానము యొక్క గొప్పతనము కూడా చెప్పబడెను

ప్రసంగాత్  :  ప్రసంగమువలన యాదృచ్ఛికంగా (తన పదాలకు ప్రామాణికతను స్థాపించడానికి)

స్వస్వభావోక్తి  :  తన యొక్క స్వభావము (అవతార స్వీకారమునందు కుడా మారని తన యధార్థస్థితి) ప్రారంభమున చెప్పబడెను

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

నాల్గవ అధ్యాయంలో, కర్మ యోగము (ఙ్ఞాన యోగంతో కలిసి) ఙ్ఞానయోగాకారత్వముగా చెప్పబడి, ఆ కర్మ యోగము యొక్క స్వరూపము మరియు వాని భేదములు, ఙ్ఞానము యొక్క గొప్పతనము, (ప్రారంభమున, తన పదాలకు ప్రామాణికతను స్థాపించడానికి) ప్రసంగమువలన యాదృచ్ఛికంగా (భగవంతుడు) తన యొక్క స్వభావమును (అవతార స్వీకారమునందు కుడా మారని తన యధార్థస్థితిని) వివరించెను.

9 వ శ్లోకం:

కర్మయోగస్య సౌకర్యం శైఘ్య్రం కాశ్చన తద్విధాః |

బ్రహ్మఙ్ఞాన ప్రకారశ్చ పంచమాధ్యాయ ఉచ్యతే ||

antharyami

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

కర్మయోగస్య  :  కర్మ యోగము యొక్క

సౌకర్యం  : సులభముగా ఆచరించతగినది

శైఘ్య్రం : శీఘ్రముగా లక్ష్యాన్ని పొందుటకు కారకమైనది

కాశ్చన తద్విధాః  : ఇట్టి కర్మ యోగము యొక్క వివిధ భాగాలు

బ్రహ్మఙ్ఞాన ప్రకారశ్చ  : సమస్త శుద్ధ ఆత్మలను ఒకే స్థాయినందు దర్శించుట

పంచమాధ్యాయ : ఐదవ అధ్యాయము నందు

ఉచ్యతేచెప్పబడెను

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఐదవ అధ్యాయము నందు, కర్మ యోగము (ఙ్ఞాన యోగముకంటే) సులభముగా ఆచరించతగినదిగా, శీఘ్రముగా లక్ష్యాన్ని (ఆత్మఙ్ఞానమును) పొందుటకు కారకమైనదిగా చెప్పి, ఇట్టి కర్మ యోగము యొక్క వివిధ భేదములు, సమస్త శుద్ధ ఆత్మలను ఒకే స్థాయినందు (బ్రహ్మఙ్ఞానము – సమదర్శనము)  దర్శించువిధము మున్నగునవి చెప్పబడెను.

 

SlOkam 10

యోగాభ్యాసవిధిర్యోగీ చతుర్ధా యోగసాధనమ్ |

యోగసిద్ధిః స్వయోగస్య పారమ్యం షష్ఠ ఉచ్యతే ||

antharyami

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

యోగాభ్యాసవిధిః  :   (ఆత్మ సాక్షాత్కారము – శుద్ధాత్మ స్వస్వరూప ప్రాప్తి కొరకు) యోగము అభ్యసించు (బాగా తెలుసుకొను) విధానము

చతుర్థా యోగీనాలుగు విధముల యోగులు

యోగ సాధనమ్అట్టి యోగమునకు పొందుటకు కారకమైన అభ్యాసము, నిర్లిప్తత మున్నగునవి,

యోగ సిద్ధిఃఆ యోగము (ఒకవేళ మధ్యలో విఘ్నమైనా కూడా) చివరికి సిద్ధించుటయు.

స్వయోగస్య పారమ్యం(భగవంతుడైన శ్రీ కృష్ణ) భక్తి యోగము యొక్క గొప్పతనము

షష్ఠేఆరవ అధ్యాయములో

ఉచ్యతేచెప్పబడెను.

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఆరవ అధ్యాయములో, (ఆత్మ సాక్షాత్కారము – శుద్ధాత్మ స్వస్వరూప ప్రాప్తి కొరకు) యోగము అభ్యసించు విధానము, నాలుగు విధముల యోగులు, అట్టి యోగమునకు పొందుటకు కారకమైన అభ్యాసము, (ప్రాపంచిక విషయములపట్ల) నిర్లిప్తత మున్నగునవి, ఆ యోగము (ఒకవేళ మధ్యలో విఘ్నమైనా కూడా) చివరికి సిద్ధించుటయు, (భగవంతుడైన శ్రీ కృష్ణ) భక్తి యోగము యొక్క గొప్పతనము మున్నగునవి చెప్పబడెను.

అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్.

మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham-3/

archived in http://githa.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org