గీతార్థ సంగ్రహం – 6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

గీతార్థ సంగ్రహం

<< గీతార్థ సంగ్రహం – 5

కర్మ, ఙ్ఞాన, భక్తి యోగముల వివరణ

23 వ శ్లోకం:

కర్మయోగస్తపస్తీర్థ దానయఙ్ఞాదిసేవనమ్ |

ఙ్ఞానయోగోజితస్వాంతైః పరిశుద్ధాత్మని స్థితిః ||

yagyam antharyami

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

కర్మ యోగః  :  కర్మ యోగము అనగా

తపస్ తీర్థ దాన యఙ్ఞాది సేవనమ్  :  నిరంతరము తపస్సు, తీర్థ యాత్రలు, దానము, యఙ్ఞము మొదలగువానిని, శ్రద్ధతో (ఫలసిద్ధి కలుగువరకు) ఆచరించుట

ఙ్ఞాన యోగః  :  ఙ్ఞాన యోగము అనగా

జిత స్వాంతైఃతమ మనస్సును జయించి (నిగ్రహించి)

పరిశుద్ధాత్మని స్థితిః : భౌతికమైన శరీరము కంటే వేరైన పరిశుద్ధాత్మ స్థితి యందు నిలచియుండుట. (లేదా పరిశుద్ధాత్మను ధ్యానించుట).

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

కర్మ యోగము అనగా నిరంతరము తపస్సు, తీర్థ యాత్రలు, దానము, యఙ్ఞము మొదలగువానిని, శ్రద్ధతో ఆచరించుట.

ఙ్ఞాన యోగము అనగా తమ మనస్సును జయించి (నిగ్రహించి),  భౌతికమైన శరీరము కంటే వేరైన పరిశుద్ధాత్మ స్థితి యందు నిలచియుండుట (లేదా పరిశుద్ధాత్మను ధ్యానించుట).

24 వ శ్లోకం:

భక్తియోగః పరైకాంతప్రీత్యా ధ్యానాదిషు స్థితిః |

త్రయాణామపి యోగానాం త్రిభిః అన్యోన్య సంగమః ||

lakshminarasimha-and-prahladaప్రహ్లాదుడు - భక్తి యోగులలో ఉత్తముడు

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

భక్తియోగః  :  భక్తి యోగము అనగా

పరైకాంతప్రీత్యా :  పరమాత్ముడైన శ్రీమన్ నారాయణుని యందు అత్యంత ప్రీతితో

ధ్యానాదిషు స్థితిః : అతనిని నిరంతరము ధ్యానించుట, ఆరాధించుట, నమస్కరించుట మొదలైననవి చేయుట.

త్రయాణామపి యోగానాం త్రిభిః : కర్మ, ఙ్ఞాన మరియు భక్తి యోగములనబడు మూడిటియందు,

అన్యోన్య సంగమః : ప్రతి యోగమున అంతర్గతముగా మిగిలిన రెండు యోగములు కలిసియుండును

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

భక్తి యోగము అనగా, పరమాత్ముడైన శ్రీమన్ నారాయణుని యందు అత్యంత ప్రీతితో, అతనిని నిరంతరము ధ్యానించుట, ఆరాధించుట, నమస్కరించుట మొదలైననవి చేయుట.

కర్మ, ఙ్ఞాన మరియు భక్తి అనబడు మూడు ఈ యోగములు ఒకదానితో మరిఒకటి అనగా,  ప్రతి యోగమున అంతర్గతముగా మిగిలిన రెండు యోగములు కలిసి యుండును.

25 వ శ్లోకం:

నిత్య నైమిత్తికానాం చ పరారాధన రూపిణాం |

ఆత్మదృష్టేస్ త్రయోప్యేతే యోగద్వారేణ సాధకాః ||

SandhyavandanamListen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పరారాధన రూపిణాం : పరమ పురుషుడైన ఆ శ్రీమన్ నారాయణుని ఆరాధన రూపమయిన

నిత్య నైమిత్తికానాం చ : నిత్య నైమిత్తిక కర్మలను (మునుపటి 24వ శ్లోకం “త్రిభిః సంగమః” లో చూసినట్లుగా) ఆచరించుట ద్వారా

ఏతే త్రయ అపిః :  ఈ మూడు యోగములు

యోగ ద్వారేణ : సమాధి స్థితికి (సంపూర్ణ ప్రశాంతత, ముఖ్యముగా మనస్సు పూర్తి నియంత్రణలో /కేంద్రీకరించి ఉండటం) చేర్చును

ఆత్మ దృష్టేః :  ఆత్మ సాక్షాత్కారము (శుద్ధాత్మ స్వరూప పరిఙ్ఞానము) కొరకు

సాధకాః :  మార్గములు

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పరమ పురుషుడైన ఆ శ్రీమన్ నారాయణుని ఆరాధన రూపమయిన నిత్య నైమిత్తిక కర్మల ఆచరన ద్వారా (మునుపటి 24వ శ్లోకం “త్రిభిః సంగమః” లో చూసినట్లుగా) ఈ మూడు యోగములు, సమాధి స్థితికి (సంపూర్ణ ప్రశాంతత, ముఖ్యముగా మనస్సు పూర్తి నియంత్రణలో /కేంద్రీకరించి ఉండటం) చేర్చుటచేత ఆత్మ సాక్షాత్కారము (శుద్ధాత్మ స్వరూప పరిఙ్ఞానము) కొరకు మార్గములు.

26 వ శ్లోకం:

నిరస్త నిఖిలాఙ్ఞానో దృష్ట్వాత్మానం పరానుగం |

ప్రతిలభ్య పరాం భక్తిం తయైవాప్నోతి తత్పదం ||

srinivasar-garudan-hanuman

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

నిరస్త నిఖిలాఙ్ఞానో :  అజ్ఞానం (ఉపాయ విరోధియైనది) అంతయూ తొలగింపబడి

పరానుగం : (పరమ భక్తితో) పరమ పురుషుడైన ఆ శ్రీమన్ నారాయణుని ఆధీనములో వుండుట

ఆత్మానం : (పరిశుద్ధాత్మను /) తమ ఆత్మస్వరూపము

దృష్ట్వా :  సాక్షాత్కరించుకొని

పరాం భక్తిం :  (పరమ భక్తిని/) స్వచ్ఛమైన భక్తిని

ప్రతి లభ్య :  పొందిన

తయా ఏవ :  ఆ పరమ భక్తి ద్వారా

తత్ పదం :  ఆ ఎమ్పెరుమాన్ యొక్క పాద పద్మములను

ఆప్నోతిచేరుకొనును

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

(ఆ మూడు యోగములు ఆచరించుటచే జీవాత్మ యొక్క) అజ్ఞానం (ఉపాయ విరోధియైనది) అంతయూ తొలగింపబడి మరియు (పరమ భక్తితో) తమ ఆత్మస్వరూపము పరమ పురుషుడైన ఆ శ్రీమన్ నారాయణుని ఆధీనములో వుండుట సాక్షాత్కరించుకొని పరమ భక్తిని పొందును. ఆ పరమ భక్తి ద్వారా ఆ ఎమ్పెరుమాన్ యొక్క పాద పద్మములను చేరుకొనును.

27 వ శ్లోకం:

భక్తి యోగస్తదర్థీ చేత్ సమగ్రైశ్వర్య సాధకః |

ఆత్మార్థీ చేత్ త్రయోప్యేతే తత్కైవల్యస్య సాధకాః ||

dhevas-worshipping-vishnu-2

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

భక్తి యోగః  :  భక్తి యోగము

తదర్థీ చేత్  :  ఎవరైతే (గొప్ప) సంపద కోరుకుంటాడో వానికి

సమగ్రైశ్వర్య సాధకః  :  గొప్ప సంపదను ఇచ్చును

ఏతే త్రయః అపి  :  ఈ మూడు యోగములు

ఆత్మార్తీ చేత్ :  ఒకవేల అతను తన శుద్ధాత్మానుభవమును కోరుకుంటే

తత్ కైవల్యస్య సాధకాః : ఉన్నతమైన శుద్ధాత్మస్వరూపానుభవమును (కైవల్యమును) కలిగించును.

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

భక్తి యోగము, ఎవరైతే సంపదను కోరుకుంటాడో వానికి గొప్ప సంపదను ఇచ్చును. ఈ మూడు యోగములును ఒకవేల ఆతడు శుద్ధాత్మానుభవమును కోరుకుంటే ఆ ఉన్నతమైన శుద్ధాత్మ స్వరూపానుభవమును (కైవల్యమును) కలిగించును.

28 వ శ్లోకం:

ఐకాంత్యం భగవత్యేషాం సమానమధికారిణాం |

యావత్ప్రాప్తి పరార్థీ చేత్ తదేవాత్యంతమశ్నుతే ||

namperumal-thiruvadi

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఏషాం అధికారిణాం  :  అర్హతగల ఈ మూడు రకాల (ఈ మూడు యోగములయందు నిమగ్నమైన) వారందరికి.      

భగవతి  :  భగవానుని పట్ల

ఐకాంత్యం  :  ఇతర దేవతలకు బదులుగా అతనిపట్ల ప్రత్యేకమైన భక్తి కలిగి

సమానం :   సాధారణము

యావత్ ప్రాప్తి  :  ఫలితాన్ని పొందుటకు ముందు

పరార్థీ చేత్  :  (సంపద లేక శుద్ధాత్మానుభవమును కోరుకునే వారు) పరమ పురుషుడైన ఆ శ్రీమన్ నారాయణుని పాద పద్మములను చేరుకోవాలను కోరికచేత

తత్ ఏవ  :  కేవలం ఆ పాద పద్మములను మాత్రమే

అత్యంతం :  ఎల్లప్పుడూ

అశ్నుతే :  చేరుకుంటారు (అలాగే ఉపాసక ఙ్ఞాని (భక్తి యోగమును అభ్యసించువాడు) కూడా తన అభ్యాసమును చివరి వరకు కొనసాగించినట్లయితే ఎమ్పెరుమాన్ యొక్క పాద పద్మములను చేరుకొనును)

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

భగవానుని పట్ల (తదేకనిష్ఠ/) ప్రత్యేకమైన భక్తి కలిగి ఇతర దేవతలను విడనాడుట, అర్హతగల ఈ మూడు యోగములయందు నిమగ్నమైన వారందరికి సాధారణము. కోరిన ఫలితాన్ని (సంపద లేక శుద్ధాత్మానుభవము) పొందుటకు ముందు, సంపద లేక శుద్ధాత్మానుభవమును కోరుకునే వారు (వారి మనసు మార్చుకొని మరియు) పరమ పురుషుడైన ఆ శ్రీమన్ నారాయణుని పాద పద్మములను చేరుకోవాలను కోరుటచేత కేవలం ఆ పాద పద్మములను మాత్రమే చేరుకుంటారు (అలాగే ఉపాసక ఙ్ఞాని (భక్తి యోగమును అభ్యసించువాడు) కూడా తన అభ్యాసమును చివరి వరకు కొనసాగించినట్లయితే ఎమ్పెరుమాన్ యొక్క పాద పద్మములను చేరుకొనును).

అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్

మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham-6/

పొందుపరిచిన స్థానము http://githa.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org